జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వ రుని హుండీ ఆదాయం రూ. 1,91,175గా వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడుకొండలు గురువారం తెలిపారు. ఆలయ అధికారులు, సత్యసాయి సేవాసమితి సభ్యులు, అర్చకుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు. కార్య క్రమంలో రావివలస ఎండల మల్లికార్జునస్వా మి, దేవాలయ ఆలయ ఈఓ జి.గురునాథరా వు, పాలక మండలి చైర్మన్ శివప్రసాద్ పాడి భక్తులు పాల్గొన్నారు.
చీటింగ్ కేసులో నలుగురికి జైలుశిక్ష
పలాస: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన కేసులో విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన వాండ్రాశి సన్యాసిరావు, ఎన్‌ఏడీ కొత్త రోడ్డుకు చెందిన రావాడ నాగేశ్వరరావు, పాతగాజువాకకు చెందిన కలుపూరి ఆదినారాయణ, పెదగంట్యాడకు చెందిన ముంజేటి శ్రీనులకు ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.4500లు జరిమానా విధిస్తూ పలాస జూనియర్ సివిల్ జడ్జి యు.మాధురి గురువారం తీర్పు చెప్పారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2014 జూన్ 6న పలాస ఉదయపురం గ్రామానికి చెందిన రాజాన కూర్మారావుకు రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసి రూ.6లక్షలు తీసుకున్నట్టు, పలాస పరిసర గ్రామాల నుంచి మరో 11 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు చొప్పున తీసుకున్నారని వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పి.రమేష్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నలుగురికీ జైలు శిక్ష, జరిమాన విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని సూర్యమహల్ జంక్షన్ సమీపంలో పొట్నూరు సంతోష్‌కుమార్‌కు చెందిన ఎస్‌వీఎస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్కు సర్క్యూట్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే రెండు ఫ్రిడ్జ్‌లు, ఫర్నిచర్ కాలిపోయాయి. సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి శ్రీనుబాబు తెలిపారు.
నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు కె.శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు.ఈ నెల 27, 28, 29 తేదీల్లో ‘శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు’ పేరిట జరిగే పోటీల్లో ఆఫీస్ సబోర్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ సహాయ సహకారాలతో కార్యకర్మం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు, ఉద్యోగుల్లో ఐక్యత పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరారు.
ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం
శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు అన్ అయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. వీరికి లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ పి.వేణుగోపాలరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చని, ఇతర విషయాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి సంప్రదించవచ్చునన్నారు. సంబంధిత పాఠశాలలు వెబ్‌సైట్‌లో చూడవచ్చునని, ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీన లోగా ఎంపికై న పాఠశాలల్లో జాయిన్ అవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 18004258599 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


