మల్కన్‌గిరి: జిల్లాలోని మాత్తిలి సమితి కుమార్‌పల్లి పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి 80 వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు . వాటిలో కొన్నింటిని అక్కడకక్కడే పరిష్కరించారు. 52 సాముహిక గ్రామ సమస్యలు కాగా, 28 వ్యక్తిగత సమస్యలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని గిరిజనులతో మాట్లాడి ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృధి శాఖ అధికారి దశరథి సరబు, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి పాల్గొన్నారు.
వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రాయఘడ బ్లాక్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. 52 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం14, గ్రామ సమస్యలకు సంబంధించినవి 38 ఉన్నాయి. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాయఘడ పంచాయతీ ఉపాధ్యక్షుడు జ్యోతి రంజన్ పాణి, బీడీఓ సంతోష్ కుమార్ బారిక్, తహసీల్దార్ సుకాంత ప్రధాన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


