నేటి నుంచి శాసన సభలో బడ్జెట్‌ సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శాసన సభలో బడ్జెట్‌ సమావేశాలు

Feb 17 2026 8:49 AM | Updated on Feb 17 2026 8:49 AM

నేటి

నేటి నుంచి శాసన సభలో బడ్జెట్‌ సమావేశాలు

భువనేశ్వర్‌: మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసన సభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు అఖిల పక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర శాసన సభ స్పీకరు సురమా పాఢి అధ్యక్షతన సోమవారం ఉదయం 11.30 గంటలకు స్పీకర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, ప్రతిపక్ష నాయకుడు ప్రసన్న ఆచార్య, ప్రతిపక్ష చీఫ్‌ విప్‌ ప్రమీలా మల్లిక్‌, కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నాయకుడు రామ చంద్ర కదమ్‌ పాల్గొన్నారు.

సభ శాంతియుతంగా, క్రమబద్ధంగా జరిగేలా చూడటంపై చర్చ దృష్టి సారించిందని సమావేశం ముగిసిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టరు ముఖేష్‌ మహాలింగ్‌ అన్నారు.

శాసన సభలో బడ్జెట్‌ సమావేశాలు సజావుగా, క్రమబద్ధంగా, శాంతియుతంగా సభా కార్యక్రమాలు కొనసాగించాలని స్పీకరు అఖిల పక్ష సభ్యులకు కోరారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి మాట్లాడుతు రాష్ట్ర ప్రజల ఆశలు, విశ్వాసాలకు శాసన సభ ప్రతిబింబమని, రాబోయే సభా సమావేశాలు సజావుగా, విజయవంతంగా నిర్వహించడానికి అన్ని పార్టీల సానుకూల సహకారం, సమన్వయం చాలా అవసరం అన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిర్మాణాత్మక చర్చలతో కొనసాగిందన్నారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణతో వికసిత ఒడిశా దార్శనికతను సాకారం చేసుకోవడానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో పాలన కొనసాగిస్తుందన్నారు.

బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌

బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 17 మంగళవారం నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 8 వరకు జరుగుతాయి. రెండు దశల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ దశల్లో సమగ్రంగా 28 పని దినాలు ఉంటాయి. గవర్నర్‌ సభలో ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 20న ఆర్థిక శాఖ బాధ్యతలు వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్‌ సమర్పణ తర్వాత వివిధ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై సభ చర్చలను చేపడుతుంది.

సమావేశానికి సిద్ధమవుతున్న పార్టీలు

ప్రతిపక్ష బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌ బడ్జెట్‌ సమావేశాలకు తమ వ్యూహాన్ని రూపొందించుకున్నాయి. ఈ రెండు పార్టీలు వేర్వేరుగా శాసన సభ పార్టీ సమావేశాలను నిర్వహించాయి. ప్రతిపక్ష పార్టీలు, బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌, వరి సేకరణ సమస్య, మహా నదీ జలాల పంపిణీ వివాదం, కాలుష్య నియంత్రణ చర్యలు వంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం అవుతున్నాయి. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల వ్యూహాత్మక సన్నద్ధతకు ధీటుగా ప్రతిస్పందించేందుకు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా అంతర్గత సమావేశాలను నిర్వహించి సమాయత్తమైంది.

శాసన సభకు 3 అంచెల భద్రత

బడ్జెట్‌ సమావేశాలకు ముందుగా శాసన సభలో, చుట్టుపక్కల 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. డాగ్‌ స్క్వాడ్‌లు, బాంబ్‌ స్క్వాడ్‌లు, స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ మరియు అగ్నిమాపక సేవ దళాలను మోహరించారు. శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నందున రాష్ట్ర రాజధానిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శాసన సభ ప్రాంగణంలో, చుట్టుపక్కల సమగ్రంగా 35 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించనున్నారు. సోమవారం భువనేశ్వర్‌, కటక్‌ జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ సురేష్‌ దేవ్‌ దత్త సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ సమావేశాలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా విస్త్తృత సన్నాహాలు చేసినట్లు తెలిపారు. సన్నద్ధత కసరత్తులో భాగంగా సోమ వారం పూర్తి స్థాయి భద్రతా రిహార్సల్స్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. శాసన సభ వెలుపల, లోపల 100 మందికి పైగా అధికారులను మోహరిస్తున్నారు. సాధారణ బలగాలతో పాటు, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి 2 ప్రత్యేక వ్యూహాత్మక యూనిట్లు (ఎస్‌టీయూ), 7 తక్షణ ప్రతిస్పందన బృందాలు (క్యూఆర్‌టీ), అగ్నిమాపక సేవ దళాలు, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ), 1 ప్లాటూన్‌ కమాండోలను మోహరించనున్నట్లు పేర్కొన్నారు.

శాసన సభ భద్రత, శాంతిభద్రతల నిర్వహణ పురస్కరించుకుని మోహరించిన 35 ప్లాటూన్ల పోలీసు బలగాలతో పాటు 7 మంది అదనపు డిప్యూటీ కమిషనర్లు, 22 మంది అదనపు కమిషనర్లు, 29 మంది ఇన్‌స్పెక్టర్లు, 111 మంది సబ్‌ ఇనస్పెక్టర్లను రంగంలోకి దింపారు. అసెంబ్లీ చుట్టూ పోలీసు బలగాలు మోహరించి సమగ్ర ప్రాంతం సీసీటీవీ నిఘా పరధిలో విలీనం చేశారు. శాసన సభ సమీపంలో 5 తాత్కాలిక పోలీసు శిబిరాలు, తాత్కాలిక పోలీసు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

వాహనాల రవాణా నియంత్రణ

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా స్థానిక 120 బెటాలియన్‌ నుంచి రవీంద్ర మండపం జయదేవ్‌ భవన్‌ వరకు వాహనాల రవాణా పురస్కరించుకుని ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పోలీసు ఉన్నతాధికారులు శాసన సభ ప్రాంగణాన్ని పరిశీలించారు, బారికేడ్లు, నిఘా వ్యవస్థలు మరియు భద్రతా దళాల మోహరింపు వ్యవస్థరి తనిఖీ చేశారు.

నేటి నుంచి శాసన సభలో బడ్జెట్‌ సమావేశాలు 1
1/1

నేటి నుంచి శాసన సభలో బడ్జెట్‌ సమావేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement