త్వరలో శ్రీ జగన్నాథుని ఆభరణాల జాబితా సిద్ధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయం రత్న భాండాగారంలో పదిలపరిచే ముత్యాలు, రత్నాలు, వైడూర్యాలు వగైరా అమూల్య ఆభరణాల జాబితా ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన లోక్ సేవా భవన్‌లో సోమ వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. పూరీ శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు సీఏఓ డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి ఈ మేరకు ముఖ్యమంత్రికి వివరణాత్మక సమాచారం అందజేశారు. రత్న భాండాగారంలో పదిలపరిచే సొత్తు సంబంధిత జాబితా ప్రాథమిక ప్రక్రియలు పూర్తిగా పూర్తయ్యాయి. నిర్ణీత సమయంలోనే వెలుపలి, లోపలి భాండాగారంలో ఆభరణాల పూర్తి పునరుద్ధరణ, పరిరక్షణ పనులు పూర్తయినట్లు వివరించారు. ఈ సమగ్ర ప్రక్రియను భారత పురావస్తు సర్వే శాఖ 95 రోజులు 333 గంటలు నిర్విరామంగా శ్రమించి పూర్తి చేసింది. దీంతో రత్న భాండాగారంలో ఆభరణాల జాబితా రూప కల్పనకు సర్వం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నిర్ధారిత కార్యాచరణ శైలి ఎస్‌ఓపీ శ్రీ మందిర్ పాలక మండలి రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత దీన్ని అమలు చేసి తుది కార్యాచరణకు శ్రీకారం చుడతారు. పటిష్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని సీఏఓ హామీ ఇచ్చారు. చివరి సారిగా 1978లో నిర్వహించిన ఆభరణాల జాబితా వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గణాంకాలు ఆధారంగా పరిగణించి ప్రస్తుత ప్రక్రియలో తాజా జాబితా రూపొందిస్తారు. ఈ యావతు ప్రక్రియని ఛాయా చిత్రాలతో డిజిటల్ కేటలాగ్‌ను తయారు చేస్తారని సమావేశంలో వివరించారు.
ఈ ఏడాది జరగనున్న రథ యాత్ర సన్నద్ధత ప్రక్రియ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. స్వామి రథ యాత్రకు ఫాసి కలప మరియు గంధపు చెక్క అవసరం అధికంగా ఉన్నందున వన ప్రకల్ప్ పథకం ద్వారా ఈ చెట్లను నాటడానికి ప్రతిపాదనను సమర్పించాలని ముఖ్యమంత్రి అధికార వర్గాలకు ఆదేశించారు. ఈ సమావేశంలో నిర్మాణాలు మరియు న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, న్యాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ పవిత్ర మోహన్ సామల్, పూరీ జిల్లా మేజిస్ట్రేట్ దివ్య జ్యోతి పరిడా పాల్గొన్నారు.


