నకిలీ మావో పోస్టర్ల సూత్రధారుల అరెస్టు
రాయగడ: జిల్లాలోని శెశిఖాల్, దుమ్మాగుడ, చందిలి, పాయికొపొడ, కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కుంబారుగడ ప్రాంతాల్లో ఈ నెల 14 వ తేదీన కలకలం సృష్టించిన మావో బ్యానర్లపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వెబ్ చానల్ రిపోర్టర్‌గా చలామణి అవుతున్న రంజు బర అలియాస్ అనుభ్రత బర, కాసీపూర్‌కు చెందిన బాలి మఝి ఉన్నారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సోమవారం డీపీఓ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో మావో పేర్లతో కలకలం సృష్టించిన బ్యానర్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ బ్యానర్ల ఏర్పాటులో ప్రధాన సూత్రధారి రంజు బర అలియాస్ అనుభ్రత బరగా వెల్లడించారు. బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. సింహాచల్ కుట్రిక, అల్పన మండంగి అలియాస్ మండికలు బ్యానర్లు ఏర్పాటు చేసిన వారిలో ఉన్నట్లు గుర్తించామని వివరించారు. వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం విచారించగా నకిలీ బ్యానర్లను ఏర్పాటు చేసే విషయంలో తాము కూడా సహకరించినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. ఈ కేసును చాలా కీలకంగా తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. దీని వెనుక ఇంక ఎంతమంది ఉన్నారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. మావోలు లొంగిపొతే వారికి ప్రభుత్వం అందిస్తున్న నగదు బహుమతితోపాటు పలు సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించడంతో ఇదే అదనుగా భావించిన కొందరు అమాయక ఆదివాసీలను మావోలుగా చిత్రీకరించి వారి పేర్లతో బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తమ దర్యాప్తులొ తేలిందన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అమూల్యకుమార్ ధల్ పాల్గొన్నారు.


