రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలి
● శిక్షణ శిబిరం ప్రారంభంలో వక్తలు
జయపురం: రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలని వక్తలు అన్నారు. జయపురం సబ్‌డివిజన్ కుంద్రాలో శ్రీఅరవింద శిక్షా నికేతన్ వారు జిల్లాస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ అధ్యాయనం, శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా విద్యాధికారి, జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ అథ్యక్షులు కరుణాకర్ భుయె అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ సాధనకర్మి యజ్ఞేశ్వర పండ, గౌరవ అతిథిగా కుంధ్ర సమితి బీడీవో పి.మనస్మిత, కొరాపుట్ జిల్లా కోఆర్డినేటర్ చంద్రకళా బగర్ది, విశ్రాంత శారీరక శిక్షణాధికారి బి.ప్రచరణ పండ, కుంధ్ర బ్లాక్ విద్యాధికారి రఘునాథ్ పంగి పాల్గొన్నారు. తొలుత ముఖ్యఅతిథి కరుణాకర భుయె రెడ్‌క్రాస్ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ అధికారి హరేకృష్ణ మహరాణ అతిథులకు స్వాగతం పలికి శిబిరం ప్రాధాన్యాన్ని వివరించారు. జిల్లా సాధన కార్యకర్త జ్యోతిరంజన్ నంద అతిథిులను పరిచయం చేశారు. శారీరక క్రీడా శిక్షణ అధికారి లలాటేందు పూజారి మాట్లాడుతూ.. సమాజ సేవలో జూనియర్ రెడ్ క్రాస్ కేడర్ నిర్వహిస్తున్న భూమికను కొనియాడారు. శ్రీఅరవింద శిక్షా నికేతన్, కుంధ్ర ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రభావతి సెట్టి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర జూనియర్ రెడ్‌క్రాస్ సాధన కర్మి యజ్ఞేశ్వర పండ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. రెడ్‌క్రాస్ ఆవిర్భావం, దాని ప్రధాన లక్ష్యం, నీతి నియమాలు, సమాజ సేవలపై అవగాహన కల్పించారు. అగ్ని మాపక సిబ్బంది హాజరై అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి, మంటలను ఎలా ఆర్పాలి, ప్రజలను, ప్రజాధానాన్ని ఎలా రక్షించాలో మాక్ డ్రిల్ ద్వారా చూపారు. ఫైర్ విధాగ అధికారి సరోజ్ కుమార్ బుతియ, సిబ్బంది రుద్రప్రసాద్ బారిక్, రామకృష్ణ గౌఢ, శ్యామలాల్ గోండ్, సుశాంత కుమార్ పండా, అజయ హరిజన్ పాల్గొన్నారు.


