నవ్వుపై విద్యార్థులకు శిక్షణ
రాయగడ: స్థానిక ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా గురువు డాక్టర్ బాబూరావు మహాంతి స్థానిక కస్తూరీనగర్‌లోని బాల్వాడి పాఠశాల విద్యార్థులకు నవ్వుపై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నవ్వుతో ఆరోగ్యంతో పాటు మంచి స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చని అన్నారు. నవ్వువల్ల అలసట వంటివి మటుమాయం అయ్యి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు సహకరిస్తుందని అన్నారు. ప్రతీ విద్యార్థి రోజులో కొంతసేపు తమకు ఇష్టమైన స్నేహితులతో కలసి కాసేపు నవ్వే విధంగా సమయాన్ని కేటాయించాలని అన్నారు. రోజూ క్రమం తప్పకుండా పాటిస్తే వారి దైనందిన చర్యలో భాగమై వారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలరన్నారు. శిక్షణ కార్యక్రమంలో బాల్వడి పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవతి మాట్లాడుతూ.. చదువుతో పాటు ఇటువంటి ఉల్లాసాన్నిచ్చే కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించే ఇటువంటి తరహా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ముందుకు రావడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం విద్యార్థులు నవ్వుతూ కాసేపు గడిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి సోమనాధ్‌పూర్ పంచాయతీ ఖారిగూఢ గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగు చూడగా.. దినేశ్ లామ్త (28) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కట్టెలు తీసుకురావడానికి దినేశ్ గురువారం మధ్యాహ్నం సమీపంలో అడవికి వెళ్లారు. అయితే చీకటిపడినప్పటికీ ఇంటికీ రాకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు గ్రామంలో, అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం స్థానికంగా ఓ మహిళ చెప్పిన ఆధారాల మేరకు అడవిలో గాలించగా ఓ చెట్టు వద్ద విద్యుత్ తీగకు తగిలి షాక్‌తో మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న కోరుకొండ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశేష అలంకరణలో గోదాదేవి
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం గోదాదేవికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానార్చకులు భాస్కరాచార్యులు స్వామివారికి సుప్రభాత పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
నవ్వుపై విద్యార్థులకు శిక్షణ
నవ్వుపై విద్యార్థులకు శిక్షణ


