ధాన్యం మండీ ప్రారంభోత్సవంలో రభస
రాయగడ: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం కొనుగొలు చేసేందుకు జిల్లా యంత్రాంగం బుధవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధాన్యం మండీల ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. తమకు పూర్తి స్థాయి టోకెన్లను మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని రైతులందరికీ టోకెన్లు మంజూరైన తర్వాతే మండీలను ప్రారంభించాలని రైతులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు. మండీ ప్రారంభొత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ హాజరయ్యారు. అయితే రైతులు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుని వారి సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. ధాన్యం ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశంలో ప్రతి సారీ రైతులను ఆహ్వానించకుండా సమావేశాన్ని నిర్వహించి మండీల ప్రారంభానికి తేదీలను ఖరారు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం విక్రయానికి సంబంధించి రైతులకు సకాలంలో టొకెన్లు మంజూరు చేయకపోవడంతో పంటపొలం నుండి కోసిన ధాన్యం భద్రపరిచేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు వివరించారు.
అదీ కాకుండా రైతులు సుమారు 80 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే వారికి కేవలం పది నుంచి 25 క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి టోకెన్లు ఇవ్వడంతో మిగతా ధాన్యం విక్రయాల్లో సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. అందువల్ల రైతులందరికీ ఒకేసారి టోకెన్లను మంజూరు చేసేంతవరకు మండీలను ప్రారంభించవద్దని ఆందోళన చేపట్టారు. దీంతో ఏడీఎం నవీన్ చంద్రనాయక్ అక్కడ నుంచి వెళ్లిపోగా సమస్యను పరిష్కరించేందుకు సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న హాజరయ్యారు. రైతులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే సమస్యను పరిష్కరించే విషయంలో అంతా కలిసి కూర్చుని సమాధానం పరుచుకోవాలని అంతేకాకుండా మండీలను ప్రారంభించేందుకు అడ్డుకోవడం చట్ట విరుద్ధమని అన్నారు. ధాన్యం క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం దశల వారీగా టోకెన్లను మంజూరు చేస్తుందని సబ్ కలెక్టర్ జెన్న అన్నారు. అనంతరం రైతులను ఆయన పిలిచి సమావేశం ఏర్పాటు చేసి వారిని బుజ్జగించారు. దీంతో చల్లబడిన రైతులు ప్రారంభోత్సవానికి అంగీకరించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న మండీలను ప్రారంభించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి దాసరథి సొరేన్, ఆర్‌ఎంసి కార్యదర్శి కస్తూరీ సన్యాసి రాజు, డీఆర్‌సీసీ జన్మాజయ్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం మండీ ప్రారంభోత్సవంలో రభస


