ధాన్యం మండీ ప్రారంభం
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ సమితి బొతాసన గ్రామ పంచాయతీలో ధాన్యం మండీని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర మంగళవారం ప్రారంభించారు. కొట్‌పాడ్ లేంప్ ఎమ్‌డీ రాజేంద్రనాయక్ మాట్లాడుతూ కొట్‌పాడ్ ప్రాంతంలో 6813 మంది రైతుల పేర్లు నమోదు చేయటం జరిగిందన్నారు. వారి నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు సమితిలో గల 17 గ్రామ పంచాయతీల్లో నోటిఫైడ్ ఏరియా కౌన్సల్‌లలో 9 మండీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రారంభించిన మండీలో రైతులు అనేక మంది ధాన్యం అమ్మేందుకు తీసుకువచ్చారు. పొక్యూర్‌మెంట్ ఏజెంట్, సంస్థల ప్రతినిధులు కనిపించలేదు. కనీసం లేంప్‌లు, ఆర్.ఎం.సిలు కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు. మండీలలో ధాన్యం కొనుగోలు చేయకపోతే చిన్న రైతులు దళారులకు అతి తక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఏర్పడుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని కృషక్ సమాజ్ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి రైతుల నుంచి మండీలలో ధాన్యం కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సమితి ఉపాధ్యక్షుడు బబులి పాణిగ్రహి, కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి పాల్గొన్నారు.


