77 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి పాల్గొన్నారు. సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 77 వినతులను స్వీకరించారు. ఇందులో 61 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు.
మిగిలిన 27 గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ అనీల్ దుదుల్ అభిషేక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమారావు, జిల్లా సామాజిక సురక్షా అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి, తదితరులు పాల్గొన్నారు.


