ముమ్మరంగా గాలింపు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా గాలింపు

Oct 28 2025 7:30 AM | Updated on Oct 28 2025 7:30 AM

ముమ్మ

ముమ్మరంగా గాలింపు

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్‌ కొత్త వంతెన పైనుంచి నాగావళి నదిలో ఆదివారం అర్ధరాత్రి దూకేసిన మహిళ కోసం ఫైర్‌ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సోమవారం ముమ్మర గాలింపు చేపట్టాయి. రోప్‌లతో కొందరు నదిలోకి దిగగా, బోట్లలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తిరిగింది. నదిలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వలన ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారిందని ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు అన్నారు. కాగా రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు మాట్లాడుతూ.. మహిళ దువ్వు రాజ్యలక్ష్మి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామన్నారు.

రైలు నుంచి జారిపడిన మహిళకు గాయాలు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయంలో రైలు నుంచి దిగుతూ జారిపడిన మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని బొడ్డకాళి గ్రామానికి చెందిన దారపు లోలాక్షి కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని పారాదీప్‌లో నివాసముంటుంది. ఆమె బంధువుల ఇంట్లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌ విశాఖ ఎక్సప్రెస్‌లో సోమవారం ఇచ్ఛాపురం వచ్చింది. ఈ క్రమంలో ట్రైన్‌ స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫారంపై ఆగింది. తుఫాన్‌ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్లాట్‌ఫారంపై వర్షపు నీరు చేరింది. ఆమె రైలు నుంచి లగేజీతో పాటు దిగుతుండగా కాలుజారి కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రురాలిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.

వ్యక్తి అత్మహత్య

రణస్థలం: మండలంలోని కొండములగాం పంచాయతీ ముక్తుంపురం గ్రామానికి చెందిన మంత్రి పెద్ద అప్పలనాయుడు (37) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, జేఆర్‌పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 18వ తేదీన అప్పలనాయుడికి భార్య రోజాతో ఇంట్లో గొడవ జరిగింది. దీంతో భార్య రోజా ఇద్దరు పిల్లలను పట్టుకుని తమ కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి కరెంట్‌ వైర్లతో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్య రోజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

అంతా నా ఇష్టం..?

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తానేమి చెబితే అదే జరగాలని.. తాను చెప్పే వారికే బిల్లులివ్వాలని.. తనకు చెప్పకుండా టెండర్లు పిలవడానికి కుదరదంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అధికారులకు హకుం జారీ చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు చెప్పకుండా ఏ పనులు చేయడానికి లేదని, ఏవైనా పనులు చేసినా.. ఎవరికై నా పనులు అప్పగించినా తనకు తెలియజేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇటు అధికారులు.. అటు కాంట్రాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ పీవీవీడీ ప్రసాదరావు, మున్సిపల్‌ ఇంజినీర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలి

శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలని దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆదివారంపేటలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్‌ కార్యాలయం వద్దకు దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయులను నియమించవద్దని జునైల్‌ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. గురుకులాల సొసైటీ కార్యదర్శి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కో–ఆర్డినేటర్‌ యశోదలక్ష్మి వినతిపత్రం అందజేశారు.

ముమ్మరంగా గాలింపు 1
1/1

ముమ్మరంగా గాలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement