హోటళ్ల బుకింగ్‌లు, రిజర్వేషన్ల రద్దు
భువనేశ్వర్: మోంథా తుఫాన్ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు అన్ని బుకింగ్‌లు, రిజర్వేషన్‌న్లను రద్దు చేయాలని హోటళ్ల యజమానులను గంజాం జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 28వ తేదీ సాయంత్రం, రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (ఆంధ్రప్రదేశ్) తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా గంజాం జిల్లాకు ఐఎండీ ఈ నెల 27న ఆరెంజ్ హెచ్చరిక, 28న రెడ్ హెచ్చరిక జారీ చేసిందన్నారు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసిందన్నారు.
మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి దేగూడ గ్రామంలో సోమవారం మేకలు కపరిపై ఎలుగుబంటి దాడి చేసింది. లైఖాన్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. రోజులాగే లైఖాన్ గ్రామం నుంచి మేకలు తీసుకొని సమిప అడవికి మేత కోసం తీసుకెళ్లాడు. సాయంత్రం అవుతుండగా తిరిగి వస్తున్న సమయంలో ఎలుగుబంటి అకస్మాతుగా అతనిపై దాడి చేసింది. కేకలు వేయడంతో సవీపంలో ఉన్నవారు చేరుకుని లైఖాన్‌ను ఎలుగుబంటి నుంచి రక్షించారు. వెంటనే మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. .
కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని బన్నువాడ గ్రామంలో సోమవారం కోతుల దాడిలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన పల్లి మోహన్‌రావు అనే రైతు తన పెరట్లో అరటి చెట్లను కోతులు ధ్వంసం చేస్తుండగా వాటిని అదుపు చేసేందుకు కర్ర పట్టుకొని వెళ్లాడు. దీంతో కోతులు అతడిపై దాడి చేశాయి. గాయాలపాలైన అతడిని వైద్యం కోసం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
‘టెట్ నుంచి మినహాయించాలి’
వజ్రపుకొత్తూరు: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సహాధ్యక్షుడు నెమలపురి విష్ణుమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా హడావుడిగా టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమన్నారు. టెట్ నోటిఫికేషన్ తక్షణమే నిలుపుదల చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని విద్యా హక్కు చట్టం 2009 లోని సెక్షన్ 23ని సవరించే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 20 నుంచి 30 ఏళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయులు జీవశాస్త్రం రాయాలనడం ఎంత వరకు సమంజసమో ఆలోచన చేసి, ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హోటళ్ల బుకింగ్‌లు, రిజర్వేషన్ల రద్దు


