తుఫాన్‌కు సర్వ సన్నద్ధత
● 7 జిల్లాల్లో ఉద్యోగుల సెలవులు రద్దు ● తీరం చేరాలని మత్స్యకారులకు పిలుపు
భువనేశ్వర్: తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్రం అంతటా అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మోంథా తుఫాన్ కదలిక మార్గం ఒడిశా వైపు నేరుగా లేనప్పటికీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు దాని ప్రభావాలను అనుభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గంజాం నుండి పారాదీప్ వరకు కోస్తా జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నందున గంజాం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంపై మోంథా తుఫాన్ ముప్పు లేకున్నా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాల్లో ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. సెలవులో ఉన్నవారు వెంటనే ప్రధాన కార్యాలయానికి తిరిగి రావాలని ఆదేశించింది. కొరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, గంజాం, కలహండి, బాలాసోర్, కేంద్రాపడా 7 జిల్లాల కలెక్టర్లు సిబ్బంది సెలవులు రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. తుఫాన్ ఆశ్రయ కేంద్రాలు, సహాయ కేంద్రాలను సిద్ధం చేశారు. రైల్వే, రోడ్డు జామ్‌లు సంభవించే అవకాశం ఉన్నందున రాకపోకలకు అడ్డంకులు తొలగించేందుకు ఓడ్రాఫ్ బందాన్ని అప్రమత్తం చేశారు. తుఫాన్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధతను రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి సమీక్షించారు. తీర ప్రాంతం జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక సహాయ కమిషనర్, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. సమీక్ష తర్వాత మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏదైనా తుఫాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. జలవనరులు, పంచాయతీరాజ్, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి అధికారులు లౌడ్‌స్పీకర్లు, మెగాఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. వెంటనే ఒడ్డుకు తిరిగి రావాలని కోరారు. చాలా మంది మత్స్యకారులు ఇప్పటికే తీరానికి చేరారు. మరి కొంత మంది సముద్రంలోనే ఉన్నారు. సముద్రం లోనికి వెళ్లిన చేపల వేట పడవలను సురక్షితంగా తీరం చేర్చేందుకు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు.
పర్యాటకులకు సూచన
మోంథా తుఫాన్ దృష్ట్యా ఈ నెల 27, 28 మరియు 29 తేదీలలో పర్యాటకులను సముద్రంలోకి లేదా బీచ్‌లోకి అనుమతించబోమని పూరీ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తుఫాన్ కారణంగా సముద్రంలో అధిక ఆటుపోట్లు దృష్ట్యా పర్యాటకులను సముద్రం లోనికి అనుమతించేది లేదన్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్, నీలాద్రి బీచ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో లైఫ్‌గార్డ్‌లను మోహరించారు. విపత్కర పరిస్థితుల నిర్వహణకు అవసరమైన సరంజామాతో వీరిని నియమించారు. తుఫాన్ నేపథ్యంలో సందర్శకుల భద్రతను పరిరక్షించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
నేటి నుంచి వర్షాలు
తుఫాన్ ప్రభావం కారణంగా సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 28, 29 తేదీలలో రాష్ట్రం అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాస్త్రవేత్త మనోరమ మహంతి తెలిపారు. ఈ నెల 27 నుంచి 30 వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. గాలి వేగం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వేగం గంటకు 110 కిలో మీటర్ల వరకు పుంజుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా బలపడింది. సోమవారం (అక్టోబర్ 27) ఉదయం నాటికి ఇది తుఫాన్‌గా అక్టోబర్ 28 (మంగళ వారం) నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, ఈ నెల 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో తుఫాన్ మోంథా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందని అంచనా.
అంగన్‌వాడీ కేంద్రాలు మూత
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేస్తారు. గర్భిణులను వైద్య కేంద్రాలకు తరలిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలిపారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు ఈ బాధ్యత కేటాయించినట్లు ఆమె తెలిపారు.


