జిల్లా యంత్రాంగం అప్రమత్తం
పర్లాకిమిడి: మోంథా ముప్పు ఉన్నందున గజపతి కలెక్టర్ మధుమిత ఆదివారం కలెక్టరేట్ చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. తుపాను ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం వద్ద తీరం దాటనుందని ఐఎండీ జారీ చేయడంతో ఆ ప్రభావంతో గజపతికి తుఫాన్ ముప్పు ఉందని, దీని ప్రభావంతో సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని జిల్లా కలెక్టర్ మధుమిత విలేకరుల సమావేశంలో తెలియజేశారు. జిల్లాలో ఏడు సమితి కేంద్రాల్లో అయిదు మండలాలకు తుపాను షెల్లర్లు సిధ్ధం చేశామని, అలాగే అంగన్‌వాడీ, శిశుసురక్షా కేంద్రాలు మూసివేస్తున్నామని అన్నారు. ఈ తుపాను ముప్పును ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు, బీడీఓ, తహసీల్దార్లు, ఇంజినీర్లకు సెలవులు రద్దు చేశామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలియజేశారు. రాయగడ బ్లాక్ గంగాబడ, కోయిపూర్, కోండమీద నివసిస్తున్న గిరిజనులకు ఆశ్రయం కల్పించి వారికి అటుకులు, బెల్లం, ఇతర డ్రైఫుడ్ ఆహారం కల్పించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, మంగళవారం రెడ్ అలెర్టు జారీ చేసినట్టు కలెక్టర్ తెలియజేశారు. ఓడ్రాఫ్ సిబ్బంది రెండు బృందాలు సోమవారం నాటికి పర్లాకిమిడి చేరుకుంటాయని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఓస్వాన్ కాన్ఫరెన్స్ హాల్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోహన, నువాగడ, ఆర్.ఉదయగిరి, రాయఘడ, గుమ్మా, కాశీనగర్, గుసాని అధికారులతో సమీక్ష జరిపారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం


