కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం

Oct 27 2025 8:48 AM | Updated on Oct 27 2025 8:48 AM

కలియు

కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం

టెక్కలి : కలియుగ కై లాసంగా పేరుగాంచిన టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి దేవాలయం కార్తీకమాస తొలి సోమవారం పూజలకు సన్నద్ధమైంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్‌ 27న తొలి సోమవారం, నవంబర్‌ 3న రెండవ సోమవారం, 11న మూడవ సోమవారం, 17న నాల్గవ సోమవారాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీర్షాభిషేకం టికెట్‌ ధర రూ.40, ప్రత్యేక దర్శనం టికెట్‌ ధర రూ.20, కేశఖండన రూ.40, రుద్రాభిషేకం రూ.58 రూపాయల చొప్పున ధరలు నిర్ణయించారు.

ఇదీ స్థల చరిత్ర..

ఎండల మల్లికార్జున స్వామి ఆలయం చరిత్రను ఎంతో మంది వేదపండితులు ఎన్నో రకాలుగా అభివర్ణించారు. వారి మాటల్లో చెప్పాలంటే... ‘త్రేతా యుగంలో రావణ సంహారం అనంతరం రాముడు తన పరివారంతో అయోధ్యకు వెళ్తూ మార్గ మధ్యలో సుమంచ పర్వతంగా పిలువబడే ప్రస్తుతం రావివలస ప్రాంతంలో తపస్సు చేయాలని వానర వైద్యుడు సుశేణుడికి ఆజ్ఞ చేశారు. కొన్ని సంవత్సరాలు తరువాత సుశేణుడి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు ఆంజనేయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించగా, సుశేణుడు ధ్యాన సమాధి కావడం గమనిస్తాడు. దీంతో సుశేనుడు పార్థివ దేహాన్ని పూడ్చి వేసి, ఆ సమాధిపై జింక చర్మాన్ని ఆనవాలుగా వేసి విషయాన్ని రామునికి తెలియజేస్తాడు. రాముడు తన పరివారంతో సుశేణుడి సమాధి వద్దకు చేరుకోగా, ఆ సమాధిపై స్వయంభూలింగం వెలియడంతో పాటు దానిపై మల్లెపూల దండ ఉండటం గమనిస్తారు. జింక చర్మం, మల్లెపూల దండతో ఉన్న ఆ లింగానికి ‘మల్లికాజినుడు’ అని నామకరణం చేసి, సమీపంలో ఉన్న కోనేరులో సీతమ్మ స్నానం చేసి కొండపై విశ్రమించి ఆ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అప్పటి నుంచి మల్లికాజినుడు నామకరణం కొనసాగగా, తర్వాత ద్వాపరయుగంలో అర్జునుడు ఈ ప్రాంతంలో శివుని కటాక్షం కోసం తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడుగగా.. నీ నామం తర్వాత నా పేరు ఉండాలని అని కోరగా, దీంతో శివుడు ఆ వరాన్ని ప్రసాదించగా, ఆ కాలంలో ‘మల్లికార్జునుడు’ అనే నామం కొనసాగింది. కాలానుగుణంగా ఈ లింగం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుండడంతో, ఈ యుగం నాటికి ‘ఎండల మల్లికార్జునుడు’గా నామం స్థిరపడింది. అప్పటి నుంచి రావివలస ఎండల మల్లికార్జునుడు వెలసిన ప్రాంతం కలియుగ కై లాసంగా కొనసాగుతోంది.

ఎండల మల్లికార్జునుడు

ఆలయానికి చేరుకోండిలా..

ఎండల మల్లికార్జునుడు ఆలయానికి చేరుకునేందుకు రోడ్డు, రైల్వే మార్గాలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుని అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలసలోని ఆలయానికి చేరుకునేందుకు అనేక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైల్వే మార్గం విషయానికి వస్తే టెక్కలితో పాటు సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నౌపడ రైల్వే స్టేషన్‌, 20 కిలోమీటర్ల దూరంలో పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి బస్సులు, చిన్నపాటి వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.

కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం 1
1/1

కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement