విజిలెన్స్ వలలో ట్రెజరీ ఉద్యోగి
● వితంతువు నుంచి రూ. 47 వేలు లంచంగా తీసుకుంటూ పట్టుబడిన వైనం
జయపురం: జయపురం స్పెషల్ ట్రెజరీ కార్యాలయంలో ప్యూన్‌గా పని చేస్తున్న హరిశ్చంద్ర మహాపాత్రో విజిలెన్స్ వలలో చిక్కారు. ఓ వివాహిత నుంచి 47 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా శనివారం సాయంత్రం జయపురం విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. చనిపోయిన ఓ ఉద్యోగి భార్యకు రావలసిన పింఛన్, ఇతర బెనిఫిట్స్ బకాయిలు చెల్లించేందుకు 87 వేలు లంచంగా డిమాండ్ చేశాడు. ఆమెకు బకాయిలతో పాటు పింఛన్ బకాయిలు మూడు లక్షల 48 వేల రూపాయలు రావాల్సి ఉంది. రావలసి డబ్బులో 25 శాతం అనగా రూ. 87 వేలు లంచం కావాలని హరిశ్చంద్ర మహాపాత్రో పిమాండ్ చేశారు. అంగీకరించిన ఆమె రూ. 40 వేలు మొదటి విడతగా మహాపాత్రోకు అందజేసింది. అయినా మిగతా రూ. 47 వేలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఆ డబ్బు ఇస్తేనే పెన్షన్ బకాయిలు రిలీజ్ చేస్తానని లేదా రిలీజ్ చేసేది లేదని మెలిక పెట్టాడు. మరో మార్గం లేక ఆమె జయపురంలోని కొరాపుట్ విజిలెన్స్ ఎస్పీ కార్యాలయ అధికారులను ఆశ్రయించి తన గోడు విన్నవించుకుంది. వారు ఆమెకు హామీ ఇచ్చి ఏమి చేయాలో వివరించారు. రూ. 47 వేలు తీసుకొనివెళ్లి మహాపాత్రోకు అందజేసింది. అప్పటికే వేచి ఉన్న విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా నిందితుడికి చెందిన రెండు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి.


