బాలియాత్ర విజయవంతం చేయండి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో కార్తీక పౌర్ణమి అనంతరం నవంబరు 9న జరగనున్న బాలియాత్రను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం శ్రీముఖలింగంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొనాలని కోరారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. కటక్ నుంచి రాజమండ్రి వరకూ మహానది, గోదావరి నదుల మధ్య విరాజిల్లిన కళింగ రాజ్యం పూర్వ వైభవం భావితరాలకు తెలియజేసేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. యాత్ర నిర్వహణకు ఎటువంటి విరాళాలు స్వ్కీరించబడవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, గ్రామపెద్దలు బి.వి.రమణ, అర్చకులు పాల్గొన్నారు.


