ప్రమాద బీమా అందజేత
మల్కన్‌గిరి: పోలీస్ కానిస్టేబుల్ బుద్రా దోర విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. మృతుని భార్యకు మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ తరఫున జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రూ.40 లక్ష చెక్కును ఎస్పీ వినోద్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు. బుద్రా దోర పోలీస్ సాలరీ ప్యాకేజీ కింద వేతన ఖాతాను తెరిచారు. బ్యాంక్ తరుఫున బీమా మొత్తం అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ కింద ఖాతా ఉన్న పోలీసు సిబ్బందికి ప్రమాదవస్తు మరణానికి రూ.కోటి, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ వినోద్ కుమార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీసీపీఎస్‌ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం శ్రీకాకుళంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఎన్నికల అధికారి బి.బాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులు చల్లా దుర్గాప్రసాద్, గురుగుబెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గురుగుబెల్లి భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడిగా చల్ల సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా అంపోలు షణ్ముఖరావు, సహాధ్యక్షుడిగా బొడ్డు శేఖర్, ఆర్థిక కార్యదర్శిగా యాళ్ల శ్యాంసుందర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, మహిళా అధ్యక్షురాలుగా పి.జయమ్మ, రాష్ట్ర కౌన్సిలర్లగా కరిమి రాజేశ్వరరావు, వడమ శరత్‌బాబు, సూర్య, బి.ప్రదీప్‌చంద్ర వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


