రొయ్యిల కోసం వెళ్లి.. విగతజీవిగా మారి..
● బందరువానిపేటలో 8వ తరగతి విద్యార్థి మృతి
గార: సరదాగా రొయ్యిల కోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన గంగాడ లక్ష్మణరావు (బేతాళుడు), లక్ష్మమ్మల రెండో కుమారుడు అప్పలరాజు (12) స్థానిక హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు ఇంటిదగ్గర పెట్టి సమీపంలోని గెడ్డలో తోటి స్నేహితులతో కలిసి రొయ్యిలు పట్టుకునేందుకు వెళ్లాడు. స్నేహితులు ఇంటికి వచ్చినా కుమారుడు ఇంటికి చేరలేదు. చాలా రోజులుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న అప్పలరాజు ఆచూకీ కోసం గ్రామంలోని బందువుల ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం నాగులచవితి నాడు గెడ్డ–సముద్రం కలిసే ప్రాంతంలో అప్పలరాజు విగతజీవిగా కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతుడికి అన్న, తమ్ముడు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చోడిపల్లి గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రొయ్యిల కోసం వెళ్లి.. విగతజీవిగా మారి..


