తుఫాన్‌పై అప్రమత్తం
● 15 జిల్లాలు ప్రభావితమయ్యే
అవకాశం
భువనేశ్వర్: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధత చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర రెవెన్యు మరియు విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి అధ్యక్షతన శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని దక్షిణ మరియు తీర ప్రాంతాల్లో దాదాపు 15 జిల్లాలు ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. వాతావరణ వైపరీత్యంతో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి జల వనరులు, పంచాయతీ రాజ్, వ్యవసాయం మరియు విద్యుత్ వంటి విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. తుఫాను తన దిశను మార్చుకున్నా, పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామన్నారు. గత అనుభవాల ఆధారంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక మరియు జిల్లా పరిపాలనలతో సమన్వయం పూర్తయిందని, ప్రతి విభాగం వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఎవరైనా జల దిగ్బంధంలో చిక్కుకుంటే వారికి వండిన ఆహారాన్ని అందిస్తామన్నారు. ప్రాణాలను రక్షించడమే ప్రధాన కర్తవ్యమని వెల్లడించారు.
తీర ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు
పారాదీప్‌లో మత్స్యశాఖ అధికారులు మరియు తీరప్రాంత పోలీసులు ముందస్తు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 29 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆదేశించారు. పారాదీప్ నెహ్రూ బంగళా ఫిషింగ్ హార్బర్, ఒఠొరొబంకి బాలిప్లాట్, సొంఢొకుదొ, నువాబజార్ మరియు చౌముహాని వంటి ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా అవగాహన ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు మరియు సీనియర్ అధికారులు సమావేశమై వాతావరణ మార్పులు, తాజా స్థితిగతులు అనుక్షణం సమీక్షిస్తున్నారు. రాష్ట్ర తుఫాను నిర్వహణ వ్యూహంపై దృష్టి సారించారు. తుఫాను ఆశ్రయ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. పొడి ఆహార సామాగ్రి తగినంతగా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అల్ప పీడన ప్రాంతం ప్రస్తుతం అండమాన్ ప్రాంతానికి సమీపంలో దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా మారిందని, పశ్చిమ–వాయువ్య దిశలో కదులుతోందని తెలిపారు.


