విద్యుత్ రంగంలో వృద్ధి అభినందనీయం
● గవర్నర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్: పునరుత్పాదక విద్యుత్ రంగంలో రాష్ట్రం వృద్ధి సాధించడం అభినందనీయమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్థానిక రాజ్ భవన్‌లో ఇంధన శాఖ కార్యకలాపాలను శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి సబ్‌స్టేషన్ల సమీపంలో పంపిణీ చేయబడిన సౌర శక్తి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సౌరశక్తి వ్యవస్థకు అనువైన స్థలం గుర్తించడం పెను సవాలుగా పేర్కొన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్‌లో ఉద్భవిస్తున్న అవకాశాలను తెలియజేశారు. ఎన్‌టీపీసీతో దాని ఉత్పత్తి కోసం సహకారాన్ని సూచించారు. ముఖ్యంగా ఐఐటీలు మరియు ఐఐఎంల నుంచి విద్యార్థులలో అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహించారు.
పీఎం సూర్యఘర్ అమలు చేయాలి
పీఎం సూర్య ఘర్‌ను పెద్ద ఎత్తున అమలు చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. టాటా పవర్ నిర్వహించే యుటిలిటీ–లెడ్ అగ్రిగేషన్ (యూఎల్‌ఏ) మోడల్ కింద ఒక కిలో వాట్ రూఫ్ టాప్ సోలార్ (ఆర్‌పీఎస్) వ్యవస్థ అమలును ఆయన సమీక్షించారు. అనంతరం పీఎం–కుసుమ్ పథకం అమలు గురించి చర్చించారు. ప్రభుత్వం పామాయిల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నందున, ఉద్యానవన శాఖ ద్వారా రైతులు పీఎం–కుసుమ్ పథకం కింద సౌర శక్తితో పనిచేసే పంపులను ఉపయోగించుకునేలా మరియు దాని ప్రయోజనాలను పొందేలా ప్రోత్సహించవచ్చునన్నారు. సమావేశంలో కార్యదర్శి రూపా రోషన్ సాహు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విశాల్ కుమార్ దేవ్, ఓపీటీసీఎల్ సీఎండీ భాస్కర్ జ్యోతి శర్మ, విద్యుత్ శాఖ సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


