కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్‌లో మళ్లీ ట్రాక్‌పై రాళ్లు పడ్డాయి. గురువారం సాయంత్రం కొరాపుట్–జయపూర్ రైల్వే లైన్‌లో జరతి–మాలిగుడ రైల్వే స్టేషన్ల వద్ద కొండ చరియలు విరిగి ట్రాక్ మీదకు చొచ్చుకు వచ్చాయి. అదే మార్గంలో అదే సమయంలో విశాఖ పట్నం నుంచి కిరండోల్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు నిలిచి పోయింది. మరో వైపు జగదల్‌పూర్ నుంచి కొరాపుట్ వైపు వస్తున్న రూర్కెలా ఇంటర్ సిటీ రైలుని జరతి స్టేషన్ వద్ద నిలిపి వేశారు. కొరాపుట్, జగదల్‌పూర్ నుంచి రైల్వే సహాయక బృందాలు ఆగమేఘాల మీద ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాయి. రాళ్లను తొలగించి ట్రాక్ క్రమబద్ధీకణ పనుల్లో నిమగ్నమయ్యారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
కొరాపుట్: ౖసెబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నబరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ మడకర్ సందీప్ సంపత్ అన్నారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం మెయిన్ రోడ్డులో రామ మందిరం వద్ద సైబర్ అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. అపరిచిత ఫోన్‌కాల్స్ వస్తే వారికి బ్యాంక్ డీటైల్స్ ఇవ్వద్దని సూచించారు. ఓటీపీ నంబర్ చెబితే ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ర్యాలీలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ తదితరులు పాల్గొన్నారు.
భువనేశ్వర్: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఒడిశా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష కుంభకోణం దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదేశాల మేరకు ఈ చర్యను చేపట్టారు. నియామక ప్రక్రియలో విస్తృతమైన అవకతవకలు, అవినీతి ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంభకోణంలో అంతర్ రాష్ట్ర వ్యవస్థీకత నేరస్తుల ముఠా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం క్రైమ్ శాఖ సీఐడీ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉండవచ్చని తేలింది. సమగ్ర దర్యాప్తును నిర్ధారించడం, అవినీతిని బహిర్గతం చేయడం, దోషులను నిర్ధారించి చట్టపరమైన చర్యలు చేపట్టడం ముఖ్యమంత్రి నిర్ణయం లక్ష్యంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు, ఇతర యూనిఫాం సర్వీసులలో సిబ్బందిని ఎంపిక చేయడానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్య నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువస్తుందని భావిస్తున్నారు.
ట్రైన్ ఢీకొని వృద్ధుడు మృతి
రాయగడ: ట్రైన్ ఢీకొన్న సంఘటనలో మృతుడు జిల్లాలోని మునిగుఢ సమితి ఆంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలోని భూడిపుడా గ్రామానికి చెందిన భగీరధి టక్రి (62)గా గుర్తించారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మునిగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మునిగూడ నుంచి వేదాంత కంపెనీకి అనుసంధానించే ట్రైన్ లైన్‌లో భాగంగా అంబొదల వద్ద ట్రైన్ లైన్‌ను దాటుతుండగా వెనుక నుంచి కంపెనీకి వెళ్లే గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలిస్తుండగా మార్గంలో వృద్ధుడు మృతి చెందినట్లు సమాచారం.


