ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితిలో ప్రజలు వివిధ సమస్యలపై గురువారం సహిద్ లక్ష్మణ నాయిక్ మూల ఆదివాసీ సంఘం సమితి కార్యాలయాన్ని, బ్లాక్ విద్యా విభాగ కార్యాలయాలను ముట్టడించారు. మూల ఆదివాసీ సంఘ అధ్యక్షుడు మహేశ్వర పెంటియ, కార్యదర్శి త్రినాథ్ సామరత్ నేతృత్వంలో సహిద్ లక్ష్మణ నాయిక్ మైదానం నుంచి భారీ ర్యాలీ చేసి తన డిమాండ్లను వినిపిస్తూ బ్లాక్ విద్యా విభాగ కార్యాలయానికి చేరి కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. బనువగుడ పంచాయితీ దిసారీగుడ పాఠశాల ఉపాధ్యాయుడు త్రినాథ్ హరిజన్ ను బొయిపరిగుడ సమితి టంగిణిగుడ పాఠశాలకు బదిలీ చేశారని, ఆ బదిలీని రద్దు చేసి అతడిని తిరిగి కుంధ్రా సమితి దిసారిగుడ పాఠశాలకు పంపాలని, పాఠశాలలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఓ వినతిని బ్లాక్ అదనపు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారికి అందజేశారు. తక్షణ చర్యలు తీసుకోకుంటే ధర్నా చేస్తామన్నారు. నాలుగు గంటలకు పైగా ఆందోళన జరిపి బీఈఓ లేకపోవడం వల్ల ఏబీఈఓ పొపాయి బెహరాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కుంద్ర బీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన మూల ఆదివాసీ సంఘ శ్రేణులు కుంద్ర సమితి కార్యాలయంలో బీడీఓ పి.మనశ్విత లేకపోవడం వల్ల సమితి కార్య నిర్వాహక అధికారి రమాకాంత నాయిక్‌కు మెమోరాండం అందజేశారు. అందులో కుంధ్ర పంచాయతీ అధ్యక్షురాలిపై అవిశ్వాసం తీసుకు వచ్చి ఒక ఆదివాసీ మహిళను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. అక్కడ ఓ పురుషుడిని కూర్చోబెట్టారని తెలిపారు. ఆ స్థానంలో మరో ఆదివాసీ మహిళను ఉంచకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆందోళనలో ఆదివాసీ సంఘ అధ్యక్షుడు మహేశ్వర పెంటియ, కార్యదర్శి త్రినాథ్ సామరత్ లతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు భజమన్ శాంత, ఉపాధ్యక్షుడు చంధ్ర సాగరియ, దుర్యోధన హరిజన్, సుభేంధ్ర భూమియ, ధనీరాం బారిక్, సాధారణ కార్యదర్శి దామోదర గోండ్, ఘాశీ భొత్ర, జగత్ నాయిక్, గుప్త నాయిక్, పూర్ణ శాంత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి


