అబుదాబిలో వలస కార్మికుడు మృతి
● ఏడు నెలలు క్రితం ఉపాధి కోసం అన్నతో పయనం ● సన్యాసిపుట్టుగలో విషాద ఛాయలు
ఇచ్ఛాపురం రూరల్: పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన కన్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి విజయ్(21) ఉపాధి కోసం ఏడు నెలలు క్రితం తన అన్నయ్య బన్నీతో కలిసి అబుదాబి వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ అబుదాబిలోని ఎన్‌హెచ్‌ఎస్ కంపెనీ కన్‌స్ట్రక్షన్‌లో స్ట్రాచలర్ ఫిట్టర్‌గా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు తామంతా క్షేమంగా ఉన్నామంటూ తల్లిదండ్రులతో విజయ్ మాట్లాడాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ గురువారం ఉదయం పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు కుప్పకూలిపోయారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వాన్ని కన్నీటిపర్యంతంగా వేడుకుంటున్నారు.


