మాజీ ఎమ్మెల్యే అరెస్టు అన్యాయం
పర్లాకిమిడి: గంజాం జిల్లా బీజేపీ నేత, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పిత్తాబాస పండా హత్య కేసులో 12 మంది నిందితులను బరంపురం ఎస్పీ అరెస్టు చేశారు. అందులో బరంపురం మాజీ ఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు విక్రమ్ పండా, మాజీ మేయర్ (బీ.ఈ.ఎం.సీ.) శివశంకర్ దాస్ ఆలియాస్ పింటు దాస్, 41వ వార్డు కార్పొరేటర్ మళయకుమార్ బిశోయి ఉండటంతో బీజేడీ (గంజాం) నాయకుడు భృగుభక్షి పాత్రో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి ఆధారాలు లేకుండా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ పండాను బుధవారం అర్ధ రాత్రి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మాజీ ఎంపీ(బరంపురం)చంద్రశేఖర సాహు, మాజీ ఎమ్మెల్యే చ్యావు పట్నాయక్‌తో కలిసి బరంపురం ఎస్పీని కలిశామన్నారు. విక్రమ్ పండాను ఎ1 నిందితుడిగా చేర్చడంలో ఎటువంటి ఆధారాలు ఉన్నాయో ఎస్పీని అడిగినా చెప్పలేకపోయారన్నారు. గంజాం జిల్లాలో బీజేడీకి నామరూపాలు లేకుండా చేయడానికే తమ పార్టీ నాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు. న్యాయవాది పిత్తబాస్ పండా హత్య అక్టోబర్ 6న జరిగిందన్నారు. ఈ హత్య వెనుక నిందితులు ఎవరు ఉన్నారో తేల్చకుండా మాజీ ఎమ్మెల్యే (గోపాల్‌పూర్) విక్రమ్ పండాను అరెస్టు చేయడం తగదన్నారు.


