నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలి
జయపురం: ఒడిశా అమలా సంఘ నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహా ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కొరాపుట్ జిల్లా అమలా సంఘ అధ్యక్షులు శశిభూషణ దాస్ డిమాండ్ చేశారు. స్థానిక బ్లాక్ విద్యాధికారి కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు ఏడాది నుంచి కొంతమంది రెవెన్యూ అమలా సంఘ కార్యకర్తలు ఒడిశా అమలా సంఘ్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిచారు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర హోం విభాగ కార్యదర్శి, సాధారణ పాలన విభాగ కార్యదర్శి, కొరాపుట్ జిల్లా కలెక్టర్, కొరాపుట్ జిల్లా ఎస్పీల దృష్టికి కూడా నిధుల దుర్వినియోగం విషయాన్ని తీసుకెళ్లామన్నారు. నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై స్పందించి వెంటనే విచారణ చేయాలని కొరాపుట్ జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర హోం విభాగ కార్యదర్శిని ఆదేశించినప్పటికీ ఫలితం లేదన్నారు. ఇప్పటికై న వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ సభ్యులు కై లాస సామంతరాయ్, జగన్నాధ మఝి, జోగేంద్ర చౌదరి, జగన్నాధ్ దాస్ ప్రసంగించారు. సమావేశంలో త్రినాథ్ పండ, ప్రతీక్ మిశ్ర, సంతూన్ జెన, బాలగోపాల మిశ్ర పాల్గొన్నారు. డిసెంబర్ 13, 14 తేదీల్లో కొరాపుట్ జిల్లా అమలా సంఘ భవనంలో మరోసారి సమావేశం కానున్నట్టు సంఘ నాయకుడు శశిభూషణ దాస్ చెప్పారు.


