
షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ ప్రమాదం
ఇచ్ఛాపురం: పట్టణంలోని బెల్లుపడ కాలనీలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బెల్లుపడ కాలనీలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ సీహెచ్ అనిల్ మేడ పైగదిలో పొగలు రావడం గమనించి స్థానికులు అతనికి తెలియజేశారు. వెంటనే పై గదిలోకి వెళ్లి తలుపు తీసి చూడగా గది మొత్తం మంటలు, పొగ వ్యాపించి ఇంట్లోని గృహోపకరణాలు కాలిపోతున్నాయి. వెంటనే విద్యుత్, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విద్యుత్ సరఫరాని నిలిపి వేయడంతో స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్, ఫైర్ సిబ్బంది ఇంటిని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని, సుమారుగా రూ.2 లక్షల ఆస్థి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న వార్డు కౌన్సిలర్ జి.ప్రదీప్ కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.