గాలి గరళం
● దివ్వెల పండగతో కాలుష్యం
● జంట నగరాల్లో దిగజారిన వాయు నాణ్యత
భువనేశ్వర్: దీపావళి వేడుకలు పలు చోట్ల వాతావరణ కాలుష్యాన్ని ప్రేరేపించగా మరి కొన్ని చోట్ల చిరు ప్రమాదాలు సంభవించాయి. ప్రధానంగా భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో కాలుష్య స్థాయిలను పెంచాయి. దీపావళి రాత్రి జంట నగరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. జంట నగరాల్లో దీపావళి వేడుకల సందర్భంగా కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను విస్మరించారు. ఈ వైపరీత్యం దృష్ట్యా అనుబంధ యంత్రాంగాలు ముందస్తుగా బాణసంచా కాల్చడంపై జారీ చేసిన ఆంక్షల్ని గాలికి వదిలేయడంతో వాయు కాలుష్యం అనివార్యమైంది. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పటాకులు పేల్చడానికి జంట నగరాల కమిషనరేట్ పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అర్ధరాత్రి దాటినా కూడా బాణసంచా కాల్చడం నిరవధికంగా కొనసాగించారు. పోలీసు యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదు. ఆంక్షల అమలు పట్ల అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యాపించాయి.
అపరిమిత బాణసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగి గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) దిగ జారింది. రాజధాని భువనేశ్వర్‌లో వివిధ ప్రాంతాలలో గాలి కలుషితమైంది. నగరంలో సమగ్రంగా ఏక్యూఐ 180కి పడిపోయింది. స్థానిక లక్ష్మీసాగర్ ప్రాంతంలో 185 ఏక్యూఐ, బాపూజీ నగర్ ప్రాంతంలో ఏక్యూఐ 174గా నమోదైంది. సాధారణంగా 100 కంటే అధిక ఏక్యూఐ ప్రమాదకరంగా పరిగణిస్తారని నిపుణుల సమాచారం. వాతావరణంలో దుమ్ము కణాలు పెరిగితే శ్వాసకోశ సమస్యలు మరియు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఈ వర్గం సమాచారం.
ఈ ఏడాది దీపావళి వేడుకలు పలు చోట్ల విషాదంగా పరిణమించాయి. కటక్ నగరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 40 మంది చికిత్స కోసం కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రి అత్యవసర, ట్రామా కేర్ విభాగాల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిపై నగర వేయరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షలను అధిగమించి భారీ పేలుడు పటాకులు పేల్చడంతో శబ్ద కాలుష్యం సంభవించిందన్నారు. భువనేశ్వర్‌లో పలు చోట్ల దీపావళి రోజున బాణసంచా పేలుళ్లలో గాయపడిన వారు స్థానిక క్యాపిటల్ ఆస్పత్రిలో చేరారు. ఇక్కడ 62 మంది బాణాసంచా పేలుడు బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాల విశ్వసనీయ సమాచారం. కటక్ నగరం పిఠాపూర్ ప్రాంతంలో బాణసంచా పేలుళ్ల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఒక కారు దగ్ధం అయింది.
క్షీణించిన దృశ్య మాన్యత
అపరిమిత బాణాసంచా కాల్చడంతో గాలి నాణ్యత బాగా క్షీణించింది. దృశ్యమాన్యత దిగజారింది. భువనేశ్వర్‌లో చాలా చోట్ల దృశ్య మాన్యత 200 మీటర్ల కంటే తక్కువగా, కటక్‌లో కేవలం 50 మీటర్ల కంటే తక్కువగా పడిపోయింది. దీని వల్ల వాహనదారులు మరియు పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. గత ఏడాది కంటె ఈ ఏడాది గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) గణనీయంగా దిగజారిందని పర్యావరణ నిపుణుల సమాచారం.
గాలి గరళం


