రద్దీ నియంత్రణకు ప్రత్యేక రైళ్లు: జనరల్ మేనేజర్
భువనేశ్వర్: పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల్ని మెరుగపరచడంపై రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అదనపు రైళ్ల నిర్వహణతో రైల్వే ప్రాంగణాలు, రైళ్లలో బాణసంచా రవాణా నివారణ, ఇతరేతర భద్రతా చర్యల నిర్వహణ కోసం వార్ రూమ్ వ్యవస్థని ప్రవేశ పెట్టినట్లు తూర్పు కోస్తా రైల్వే మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు. రాత్రింబవళ్లు ఈ వ్యవస్థ పనిచేస్తుంది. జోనల్, మండల స్థాయిలో అధికారులు ప్రత్యక్షంగా దీని కార్యాచరణ పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బంది లేని ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 12,000 పైబడి ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వీటిలో తూర్పు కోస్తా రైల్వే 367 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఖుర్దారోడ్, వాల్తేరు, సంబల్‌పూర్ మండలాల్లో 900 పైబడి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు ప్రయాణికుల సౌకర్యాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు జనరల్ మేనేజరు వివరించారు. ఖుర్దారోడ్ రైల్వే మండలంలో ఈ ఏర్పాట్లుని స్థానిక అదనపు మండల రైల్వే అధికారి పి. కె. బెహరా వివరించారు. స్థానిక మండల రైల్వే కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


