మల్కన్‌గిరిలో చిన్నారులకు చుక్కల మందు | - | Sakshi
Sakshi News home page

మల్కన్‌గిరిలో చిన్నారులకు చుక్కల మందు

Oct 13 2025 9:04 AM | Updated on Oct 13 2025 9:04 AM

మల్కన

మల్కన్‌గిరిలో చిన్నారులకు చుక్కల మందు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సోమేశ్‌ ఉపాధ్యాయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఐదేళ్ల చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 13, 14 తేదీల్లో ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు జిల్లాలోని ఏడు సమితుల్లో ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయించుకోనివారిని గుర్తించి పోలియో డ్రాప్స్‌ వేస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా 752 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 1504 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి బ్రోజబాల్‌ దాస్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జయపురం: జయపురం– బొరిగుమ్మ 26వ జాతీయ రహదారిలో ఉమ్మిరి గ్రామ సమీపంలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గిడ్డంగుల సమీపంలో బైక్‌–కారు ఢీకొన్నాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. మరణించిన వ్యక్తి జయపురం సమితి ఆంబాగుడ పోలీసు పంటి పరిది మండాపొదర్‌ గ్రామ వాసి ధనపతి నాయక్‌(20)గా గుర్తించారు. మరణించిన వ్యక్తి శనివారం మధ్యాహ్నం తన బంధువును బైక్‌పై జయపురం తీసుకెళ్లాడు. అక్కడ నుంచి సాయంత్రం తన గ్రామానికి బయలు దేరివస్తున్నాడు. ఆ సమయంలో అతి వేగంగా వస్తున్న కారు, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న ధనపతి నాయక్‌ సంఘటనా స్థలం వద్దే మరణించాడు. ప్రమాదంలో అతడి తలకు బలమైన దెబ్బ తగలటంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన అంబాగుడ పోలీసు సంటి పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కొరాపుట్‌ జిల్లా కేంద్ర హాస్పిటల్‌ జయపురానికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆదివారం పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృత దేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సంతబొమ్మాళి: మండలంలోని లక్కీవలస పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన తుంబల చిరంజీవి (25) అనే మత్స్యకార యువకుడు శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అక్కడ ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న చిరంజీవి ఇటీవలే స్వగ్రామం వచ్చాడు. పది రోజుల కిందట తిరిగి రాజమండ్రి వెళ్లిపోయాడు. బైక్‌పై వెళ్లూ లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి అదే వాహనం కిందపడి మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విని తండ్రి గురువులు, తల్లి ఆదెమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

పలాస: బారువ–మందస రైల్వేలైన్‌లో గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియన వ్యక్తి మృతి చెందినట్టు పలాస జి.ఆర్‌.పి ఎస్‌ఐ కోటేశ్వరరావు ఆదివారం తెలిపారు. మృతుడి ఛాతిపై ‘ఐ లవ్‌ యు స్వాతి’ అని తెలుగులో రాసిన పుట్టుమచ్చ ఉందన్నారు. వివరాలు తెలిస్తే 9440627567 నంబరుకు సమాచారం అందించాలని కోరారు.

జాతీయ పోటీల్లో రాజశేఖర్‌ ‘పవర్‌’

గార: కొర్ని గ్రామానికి చెందిన చమల్ల రాజశేఖర్‌ జాతీయ పోటీల్లో విజయదుందుభి మోగించాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన నేషనల్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియ్‌న్‌షిప్‌ – 2025 పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించి శభాష్‌ అనిపించాడు. ఫుల్‌ పవర్‌లిఫ్టింగ్‌, పుష్‌పుల్‌, బెంచ్‌ప్రెస్‌ విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించాడు. గతంలోనూ ఇండియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జంషెడ్‌పూర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీలల్లో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. యువ క్రీడాకారుడి ప్రతిభ పట్ల ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, క్రీడాధికారులు హర్షం వ్యక్తంచేశారు.

మల్కన్‌గిరిలో చిన్నారులకు చుక్కల మందు1
1/2

మల్కన్‌గిరిలో చిన్నారులకు చుక్కల మందు

మల్కన్‌గిరిలో చిన్నారులకు చుక్కల మందు2
2/2

మల్కన్‌గిరిలో చిన్నారులకు చుక్కల మందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement