
మద్యం మత్తులో ఉన్మాది హల్‌చల్
● కత్తి పట్టుకొని పలువురిపై దాడి
● ఇద్దరికి తీవ్రగాయాలు
● మోహన్ కుమార్ నాయక్‌ను అరెస్టు చేసిన పోలీసులు
జయపురం: జయపురం బెడ సాహిలో తాగుబోతు(ఉన్మాది) కత్తి పట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆ ప్రాంత ప్రజలు అతి కష్టంతో అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో గల గంగా మా మందిరంలో దేవీ పూజా స్థలంలో గల దేవి ఖడ్గాన్ని తీసుకువచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నవారిపై కత్తితో దాడి చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన పట్టణ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు అతడిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా పోలీసులపైనా దాడి చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునే సమయంలో ఉన్మాది కిందపడ్డాడు. ఆ సమయంలో ప్రజలు అతడిని పట్టుకున్నారు. పోలీసుల సహకారంతో గంట సమయం ఆ ఉన్మాదిని పట్టుకొనేందుకు శ్రమించిన ప్రజలు అతడికి దేహశుద్ధి చేశారు. ఉన్మాది వ్యక్తి మోహన్ కుమార్ నాయక్(44) అని పోలీసులు వెల్లడించారు. అతడు మద్యం తాగి ఉన్మాదంతో గత రాత్రి ఇంటిలో భార్య, కుమార్తెను కొట్టాడని ఆ వీధి వాసులు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఆ తాగుబోతు వీధిలో భయభ్రాంతులను చేస్తున్నాడని ఆరోపణ. అతడి దాడిలో సింహాచల గంతాయిత్, చిన్మయ సాహు గాయపడినట్లు ప్రజలు వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. నాయక్ తాగుబోతు కావటం వలన అతడు మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.