
అరసవల్లిలో భగళాముఖి అమ్మవారు
శ్రీకాకుళం కల్చరల్ : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి కొలువుదీరిన అరసవల్లిలోనే భగళాముఖి అమ్మవారు ప్రత్యేకంగా పూజలందుకుంటున్నారు. ప్రస్తుత తరంలో చాలామందికి ఈ విషయం తెలియదనే చెప్పాలి. సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూలవిరాట్ మందిరానికి ఆనుకొని ఉన్న దుర్గాదేవిని భగళాముఖి అమ్మవారుగా పిలుస్తారు. ప్రత్యక్ష నారాయణుని దర్శించుకున్న తరువాత బయటకు వస్తే మనకి తీర్థం ఇచ్చి శఠగోపం పెడతారు. అక్కడే ఈ అమ్మవారు కొలువుదీరారు. భగళాముఖి అమ్మవారికి ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. వారే జలుమూరులో కొండపైన ఉన్న ఇంద్రాణి అమ్మవారు, శ్రీముఖలింగంలో వారాహి అమ్మవారు. అరసవల్లిలో శక్తిస్వరూపిణిగా ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, నిత్యపూజలు అందుకుంటారు.
పంచాయతన ఆలయంగా అరసవల్లి..
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని పంచాయతన ఆలయంగా పిలుస్తారని మీకు తెలుసా!. ఎందుకంటే అక్కడ ఆదిత్యుడు, అంబిక, విష్ణు, గణనాథుడు, మహేశ్వరుడు కలసి ఉన్నారు. అందుకే ఈ ఆలయాన్ని పంచాతయన ఆలయంగా కొలుస్తారనిప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఆదిత్యుడికి రథసప్తమి వేడుకలు, ఈశ్వరుడికి శివారాధన, శివరాత్రి, కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయి. వినాయకుడికి గణపతి ఉత్సవాలు, నిత్య పూజలు నిర్వహించారు. విష్ణుతత్వంగా మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇలా అనేక ప్రత్యేకతలతో అరసవల్లి ఆదిత్యాలయం విరాజిల్లుతోంది.
మీకు తెలుసా?

అరసవల్లిలో భగళాముఖి అమ్మవారు