
సోదరభావంతో మెలగాలి
జయపురం: సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం, మత మౌఢ్యం మొదలగు రుగ్మతలకు సరైన చికిత్స చెప్పగలిగేది సార్వత్రిక సోదరత్వమే నని స్వామీ వివేకానంద 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగోలో చేసిన ప్రసంగంలో ఉద్బోధించారని ప్రముఖ విద్యావేత్త , ప్రసిద్ధ రచయిత నళిణీ రంజన్ రథ్ అన్నారు. యూనివర్షల్ బ్రదర్‌హుడ్ డే(సార్వత్రిక సోదర దినోత్సవం) సందర్భంగా గురువారం రాత్రి స్థానిక నెహ్రూనగర్‌లోని అగ్రసేన్ భవనంలో వివేకానంద కేంద్రం, కన్యాకుమారి వారి , జయపురం శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మానవులు వ్యత్యాసాలను విడిచి సోదరులుగా ఏకమై నడచినప్పుడు సమాజం ప్రగతి పథం పయనిస్తోందన్నారు. సోదరభావమే సమసమాజ నిర్మాణానికి,శాంతి స్థాపనకు, ప్రగతికి పునాది అన్నారు. కార్యక్రమంలో వివేకానంద కేంద్ర జయపురం శాఖ కోఆర్డినేటర్ ప్రమోద్ కుమార్ రౌళో, కేంద్ర సభ్యురాలు బణిత పండ, ఆల్ ఇండియ రేడియో జయపురం విశ్రాంత అధికారి నరేంద్రనాథ్ పట్నాయక్, స్వామి వివేకానంద కేంద్ర కమిటీ సభ్యురాలు విజయలక్ష్మీ రాయ్, నయన బిశాయి, జున్ను పండ, రేణుకదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు ప్రమోద్ కుమార్ రౌళో బహుమతులు అందజేశారు.