
నిన్న టాపర్.. నేడు లంచగొండి
భువనేశ్వర్: ఒడిశా సివిల్స్ పోటీ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన నిన్నటి యువ అధికారి నేడు లంచగొండిగా రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. సంబల్‌పూర్ జిల్లా బమ్రా తహసీల్దార్ అశ్విని కుమార్ పండా రూ.15,000 లంచం తీసుకుంటుండగా అరెస్టు శుక్రవారం చేశారు. మ్యుటేషన్ కేసులో వ్యవసాయ భూమిని ఇంటి స్థలంగా మార్చడానికి అతడు రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బృందం వ్యూహాత్మకంగా తన కార్యాలయ డ్రైవర్ పి.ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.15,000 లంచం తీసుకుంటుండగా అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా డ్రైవరు ప్రవీణ్ కుమార్‌ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం కింద గుంజిన సొమ్ముని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆనాడు 29 ఏళ్ల యువకుడి విజయగాథ లక్షలాది మంది ఆశావహ యువతకు ప్రేరణగా నిలిచింది. నేడు లంచం వ్యవహారం తాజా చర్చలకు దారితీసింది. ధర్మశాల మండలం ఖేత్రపాల్ గ్రామానికి చెందిన అశ్విని కుమార్ పండా ఒడిశా సివిల్ సర్వీసెస్‌లో ఎలాంటి శిక్షణ లేకుండానే 2019 ఒడిశా సివిల్స్ పరీక్షల్లో తన మొదటి ప్రయత్నంలోనే తహసీల్దార్‌గా ఎంపికై అగ్రస్థానంలో ఉత్తీర్ణత సాధించాడు.