
హత్య చేసి.. బంగారం తాకట్టుపెట్టి..
● వీడిన చంద్రయ్యపేట మహిళ మృతి కేసు మిస్టరీ
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఆమదాలవలస : పట్టణంలోని చంద్రయ్యపేటలో ఆగస్టు 30న జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసులు చాకచక్యంగా విచారణ జరిపి హత్య కేసుగా నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. చంద్రయ్యపేటకు చెందిన సీపాన రమణమ్మ (45)కు సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి పంచాయతీ నందికొండ కాలనీకి చెందిన అడపాక నవీన్‌తో పరిచయం ఉంది. నవీన్ తరచూ ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఆగస్టు 30న ఓ యువతిని తీసుకొని రమణమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమెను పంపించేసిన తర్వాత రమణమ్మను కూడా బలవంతం చేయగా అందుకు నిరాకరించింది. కోపోద్రుక్తుడైన నవీన్ రమణమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న 98 గ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి, రూ.20 వేల నగదు దోచుకుని పారిపోయాడు. కొంత బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు తీసుకొని హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జల్సాలు చేశాడు. మిగతా బంగారం, వెండిని తన ఇంట్లోనే దాచిపెట్టాడు. మరోవైపు, పోలీసులు రమణమ్మ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయగా ఊపిరి ఆడకపోవడంతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రమణమ్మ మొబైల్ కాల్ డేటా ఆధారంగా నవీన్ కోసం గాలించగా ఆ విషయం నిందితుడికి తెలిసి సరుబుజ్జిలి రెవెన్యూ అధికారి వద్ద లొంగిపోయాడు. ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉన్న బంగారం, నిందితుడి ఇంటి వద్ద ఉన్న ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ బాలరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.