
అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలి
● ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా నోడల్ కార్యదర్శి తిరుమల
నాయక్ సమీక్ష
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గ్రామీణ భవనాలు, తాగునీటి పథకాలు, విద్య, వైద్య, అంగన్‌వాడీ భవనాలు, గోపబంధు జన ఆరోగ్య యోజన పథకాల పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా నోడల్ కార్యదర్శి, బీడీఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.తిరుమలనాయక్ అన్నారు. గజపతి జిల్లాలో రెండు రోజులపాటు గుమ్మా, కాశీనగర్, ఆర్.ఉదయగిరి, నువాగడ, మోహనా సమితుల్లో పర్యటించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 3,79,071 మంది గోపబంధు జన ఆరోగ్య యోజనా పథకం కింద దరఖాస్తు చేసుకోగా, కేవలం 2,23,238 మందికి మాత్రమే ఆరోగ్య కార్డులు అందజేశారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియజేయాలని జిల్లా ముఖ్య వైద్యాధికారి, డీిహెచ్‌ఓ డాక్టర్ ఎం.ఎం.ఆలీని ప్రశ్నించారు. కాశీనగర్ బ్లాక్‌లో అల్లగ గ్రామంలో ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని, ఖండవ వద్ద నిర్మించిన మెగా తాగునీటి పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిన సమయానికి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో అంత్యోదయ గృహాలు నిర్మాణం, పర్లాకిమిడి పట్టణంలో శంకర్‌బాస్ చెరువు పుణరుద్ధరణ పనులు, రోడ్లు, ఆహార కేంద్రాల నిర్వహణ మెరుగుపరచాలని పురపాలక ఈఓ లక్ష్మణ ముర్మును ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా హెడ్‌క్వార్టర్ ఆస్పత్రిలో డాక్టర్లు కొరత వెంటాడుతుందని దీనిని సకాలంలో నియామకాలు చేపట్టాలని డా.ఎన్.తిరుమల నాయక్ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మధుమిత, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, డీఎఫ్‌ఓ కె.నాగరాజు, ఆదనపు సీడీఓ ఫృఽథ్వీరాజ్ మండళ్, ఏడీఎం ఫల్గుణీ మఝి, తదితరులు పాల్గొన్నారు.