
మంచినీటి ప్రాజెక్టు పనుల్లో జాప్యం
రాయగడ: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మంచినీటి సౌకర్యార్ధం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన పనుల్లో జాప్యమెందుకు చోటు చేసుకుంటుందని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ప్రశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులపై ఆయన మండిపడ్డారు. అధికారులు కాగితాల మీదే ప్రాజెక్టులకు సంబంధించిన పనులను లెక్కలు చూపించడం కాదని, వాస్తవ పరిస్థితులను తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ దానిని విస్మరిస్తున్నారని అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో మంగళవారం గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్షించి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్టు విమర్శలు వస్తున్న నేపథ్యంలో పనులు బాగా చేపట్టాలన్నారు. గత కొద్ది రోజుల క్రితం జిల్లాలోని బిసంకటక్ కోర్టు సమీపంలొ మేగా తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పైపు లైన్ పగిలి నీరు వృథా అవ్వడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకమీదట పనుల్లో నాణ్యత కనిపించకపొతే చర్యలు చేపట్టడం ఖాయమని అన్నారు. అదేవిధంగా కొనసాగుతున్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో తదితరులు పాల్గొన్నారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

మంచినీటి ప్రాజెక్టు పనుల్లో జాప్యం