
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఆమదాలవలస: పట్టణంలోని డాబాలవారి వీధికి చెందిన గూడాడ ఉపేంద్ర (27) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మునగవలస గ్రామానికి చెందిన ఉపేంద్ర సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామానికి చెందిన కొంచాడ సునీత అనే వివాహితతో మూడేళ్లుగా పట్టణంలోని డాబాలవారి వీధిలో నివాసం ఉంటున్నాడు. మృతుడు జిల్లా కేంద్రంలోని ఒక జిరాక్స్ షాపులో పనిచేస్తుండగా, వివాహిత మహిళా సునీత పట్టణంలోని కిరాణా దుకాణంలో పనిచేస్తూ సహ జీవనం చేసేవారు. అయితే మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తల్లి గూడాడ పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.