
ద్విచక్ర వాహనం ఢీకొని రైతు దుర్మరణం
జయపురం: జయపురం సమితి బి.సింగపూర్ పోలీసు స్టేషన్ పరిధి టింగిరిపుట్ గ్రామంలో మోటార్ సైకిల్ ఢీకొని రైతు దుర్మరణం చెందాడు. మరణించిన రైతు టింగిరిపుట్ గ్రామానికి చెందిన బలరాం నాయిక్ (50)గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం బలరాం నాయిక్ గ్రామ సమీపంలోని పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లడు. బాగా పొద్దుపోయిన తరువాత బలరాం ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తులు అతన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బలరాం తలకు బలమైన గాయమైంది. కదల్లేని స్థితిలో రోడ్డుపై పడ్డాడు. బైక్‌పై వస్తున్న రుకదర నాయిక్, ఉమా పొరజ, గోపాల్‌లు బైక్‌తో పాటు పంట పొలంలో పడిపోయారు. ఆ ప్రమాదాన్ని చూసిన ఆ ప్రాంతంలో ఉన్న వారు సంఘటనా ప్రాంతానికి వచ్చి బలరాం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బలరాంను కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ బలరాం అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ప్రమాదంపై బి.సింగపూర్ పోలీసులకు మృతుని కుటుంబ సభ్యులు లిఖిత ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై వస్తున్న ముగ్గురు మద్యం తాగి ఉన్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బైక్‌ను సీజ్ చేశారు.

ద్విచక్ర వాహనం ఢీకొని రైతు దుర్మరణం