
గ్రంథాలు, సంప్రదాయాలఉల్లంఘన తగదు
● పూరీ గజపతి మహారాజా
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని సంస్కృతి ఆచరణలో కృష్ణచైతన్య అంతర్జాతీయ సంఘం (ఇస్కాన్) గ్రంథాలు, సంప్రదాయాల ఉల్లంఘనకు పాల్పడుతోందని పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ అన్నారు. ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రముఖ పండితులు జగన్నాథ స్వామి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఆచరించడానికి సంబంధించిన గ్రంథ మార్గదర్శకాలపై తమ తుది అభిప్రాయాన్ని తెలియజేశారు. జగన్నాథుని ఉత్సవాలు, యాత్రలు పురాణ గ్రంథాల ఆధారిత తిథుల ప్రకారమే జరగాలన్నారు. యథేచ్ఛగా నిర్వహించడం ఎంత మాత్రం తగదని పూరీ గజపతి మహారాజా, శ్రీమందిరం పాలక మండలి అధ్యక్షుడు దివ్యసింగ్ దేవ్ సంతకం చేసిన లేఖతో 100 పేజీల భారీ నివేదికను పశ్చిమబెంగాల్ మాయాపూర్‌లో ఇస్కాన్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం, ఇతర సీనియర్ సభ్యులకు పంపారు. వారి ప్రతిస్పందన కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. ఇస్కాన్ సానుకూల ప్రతిస్పందన కోసం నెల రోజుల గడువు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇస్కాన్ ప్రతిస్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ఖరారు అవుతుందన్నారు. ప్రధానంగా జగన్నాథుని స్నాన యాత్ర, రథ యాత్రని ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల నిర్వహణలో శ్రీ మందిరం సంస్కృతి ఆచార వ్యవహారాలకు బాహాటంగా నీళ్లోదిలి పవిత్ర జగన్నాథ సంస్కృతిని పక్కదారి పట్టిస్తుంది. ఈ చర్య పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోందన్నారు. దైవిక ఆజ్ఞలకు అనుగుణంగా స్నాన యాత్ర , రథ యాత్ర సందర్భాల్లో మాత్రమే ఏటా 2 సార్థలు శ్రీ మందిరం రత్న వేదికపై కొలువు దీరిన చతుర్థా దారు మూర్తులను బయటకు తరలించడం జరుగుతుందన్నారు. గ్రంథాలు, మహర్షులు, వేద పండితుల మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన తిథుల్లో కాకుండా ఇతర అనుకూల తేదీల్లో ఇస్కాన్ ఆచారానికి విరుద్ధంగా ప్రపంచంలో పలుచోట్ల జగన్నాథ స్వామి స్నాన యాత్ర, రథ యాత్ర నిర్వహిస్తారు. ఇటువంటి చర్యలు మతపరమైన భావాలను దెబ్బతీస్తాయని ఇస్కాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రథయాత్ర అనేది ఒక పవిత్ర కార్యక్రమం, దీనిని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాల కోసం ప్రదర్శన, కవాతుగా పరిగణించకూడదని తెలియజేశామన్నారు. పూరీ శ్రీ గోవర్ధన్ పీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి గ్రంథాలు, శాస్త్రాలు నిర్దేశించిన తిథులను ప్రపంచ వ్యాప్తంగా కచ్చితంగా పాటించాలని తెలిపారు. పదే పదే అభ్యంతరాలు లేవనెత్తి లిఖితపూర్వక లేఖల సంప్రదింపులకు ఇస్కాన్ పెడ చెవినపెట్టి ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి సీఏఏ, కొత్తగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులు, శ్రీజగన్నాథ సంస్కృతి పరిశోధకులు, పండితులు పాల్గొన్నారు.