
సృజనాత్మకతకు వేదిక.. విద్యార్థి విజ్ఞాన్ మంథన్
శ్రీకాకుళం: విద్యార్థి విజ్ఞాన్ మంథన్.. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించే ప్రతిభా పరీక్ష. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదివే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఇందులో ప్రతిభ కనబరిస్తే డీఆర్‌డీఓ, ఇస్రో, బీఏఆర్‌సీ వంటి ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఇంటర్నిషిప్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. దీనికి అదనంగా ప్రతినెలా రూ.2000 చొప్పున ఏటా రూ.24 వేలను ప్రోత్సాహకంగా అందిస్తారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో పరీక్ష రాసే సౌలభ్యం ఉంది. పాఠశాల స్థాయిలో ఎంపికై తే రాష్ట్రస్థాయికి తరగతుల వారీగా 150 మందిని ఎంపిక చేసి పంపిస్తారు. అక్కడ ప్రతిభ చూపిన వారికి ఒక్కో తరగతి నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిజాతీయస్థాయిలో జరిగే పరీక్షలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచేవారికి రూ.5000, రూ.2000, రూ.1000, సర్టిఫికెట్లను అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.25 వేల నగదు బహుమతి ఏడాది పాటు ఉపకార వేతనం అందజేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు 20 రోజులు పాటు పేరొందిన సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
స్కాలర్‌షిప్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు అర్హులు
ఎంపికై న వారికి నెలకు రూ.2000 చొప్పున ప్రోత్సాహకం
సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు గడువు