
డ్రోన్‌తో స్ప్రేపై అవగాహన
బలిజిపేట: నానో యూరియా, డీఏపీలను డ్రోన్‌తో స్ప్రే చేసే విధానంపై మండలంలోని నారాయణపురంలో రైతులకు శనివారం అవగాహన కల్పించారు. మండల వ్యవసాయశాఖ ఏఓ శివగణేష్ ఆధ్వర్యంలో నారాయణపురంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇఫ్కో కంపెనీ వారి సారథ్యంలో నానో యూరియా, డీఏపీలను ఇద్దరు రైతులకు చెందిన భూములలో డ్రోన్‌తో స్ప్రే చేయించారు. ఏఓ శివగణేష్ రైతులతో మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించాలని, మోతాదుకు మించి యూరియా వినియోగించడం వల్ల భూసారం తగ్గుతుందని తెలిపారు. అందుకు ప్రత్యామ్నాయంగా డ్రోన్‌తో స్ప్రే చేయించడం వల్ల రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, మందు పొలమంతా స్ప్రే అయి పంటకు మేలు జరుగుతుందన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.