
కొలాబ్ నదిపై వంతెన నిర్మించాలి
జయపురం: పాత్రోపుట్ సమీపంలోని కొలాబ్ నదిపై ఉన్న ప్రాచీన ఇనుప వంతెనను పరిరక్షించడంతో పాటు అక్కడ నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టాలని బొయిపరిగుడ, లమతాపుట్ సమితుల ప్రజలు కొలాబ్ బ్రిడ్జి సురక్షా మంచ్ నేతృత్వంలో వంతెన వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. దీంతో వంతెనకు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుందని పేర్కొన్నారు. బ్రిటీష్ పాలనలో నిర్మించిన వంతెనను పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రస్తుతం ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచారన్నారు. అయితే అనంతరం టెండర్ రద్దు చేశారని, వెంటనే టెండర్ పిలిచి వంతెన నిర్మించాలని కోరారు. వెంటనే వంతెన నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.