
కంసారిగుడలో అత్యాధునిక పశువైద్యశాల
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలొని కంసారిగుడలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పశువైద్యశాల ఏర్పాటుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. టికిరిలోని ఉత్కళ అల్యూమిన కర్మాగారం ఈ మేరకు శుక్రవారం సెంచురియన్ విశ్వవిద్యాలయం ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సహాకారంతో ఒప్పందాలను కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ పట్ల ఉత్సాహం పెంచడంతో పాటు స్థిరమైన జీవనోపాధిని అందించడంలో అలూమిన కార్మాగారం యాజమాన్యం ముందడుగు వేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాడి పశువుల సంరక్షణ చర్యల్లో భాగంగా ఆధునిక సౌకర్యాలు గల పశువైద్య శాలను ఏర్పాటు చేసి పాడి రైతులను అదుకోవాలన్న సదుద్దేశ్యంతో సన్నహాలు చేస్తున్నట్లు కర్మాగారం యాజమాన్యం ఈ మేరకు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా పశువైద్యశాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మోబైల్ హెల్త్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమవుతుంది. కంసారిగుడ గ్రామంతో పాటు సమీపంలోని సుమారు 50 గ్రామాలు ఈ సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఉత్కళ అల్యూమిన కార్మాగారం యూనిట్ హెడ్ మూర్ బేగ్ వివరిస్తు పశువైద్య సేవలు, పశు సంరక్షణ వంటి వాటిలో గణనీయమైన మార్పులు వస్తాయని వివరించారు. కర్మాగారానికి చెందిన సీఎస్‌ఆర్ ద్వారా పాడి రైతులను ఆదుకునేందుకు చేపడుతున్న చర్యల్లో ఇదోభాగమని వివరించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ ముక్తి కాంత్ మిశ్రా, సీయూటీఎం డైరెక్టర్ అరుంధతి బిస్వాల్ తదితరులు ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు.