
మహానదిలో పెరుగుతున్న నీటి మట్టం
భువనేశ్వర్: రాష్ట్రంలో పలు చోట్ల తెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రముఖ నదుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ప్రధానంగా మహా నదిలో నీటి మట్టం ఉరకలేస్తోంది. అయితే వరద ముంపు తీవ్రత లేదని జల వనరుల విభాగం ప్రముఖ ఇంజినీర్ చంద్ర శేఖర పాఢి తెలిపారు. మరో వైపు వైతరణి నది కూడ పొంగి పొరలుతుంది. గత 3 నెలల్లో వైతరణిలో వరద ఉధృతి తారస పడడం వరుసగా ఇది మూడోసారి అని జల వనరుల శాఖ ప్రముఖ ఇంజినీర్ పేర్కొన్నారు. 14 మండలాల్లో 100 మిల్లీ మీటర్ల పైబడి, 42 మండలాల్లో 50 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఎగువ మహానది, వైతరణి, బుఢాబొలొంగొలో అధిక వర్షపాతం నమోదైంది. వైతరణిలో నామ మాత్రపు వరద పరిస్థితి తారసపడుతుంది. అఖువాపొడా తీరంలో వైతరణి నదిలో నీటి మట్టం ప్రమాద సంకేతం అధిగమించి 0.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. వరద విపత్తు నిర్వహణ సన్నద్ధతతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హిరాకుద్ జలాశయంలో 14 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో లోతట్టు మహా నదిలో నీటి మట్టం పెరుగుతుంది. వరదలు సంభవించవని జల వనరుల శాఖ స్పష్టం చేసింది.

మహానదిలో పెరుగుతున్న నీటి మట్టం