
మాటలకే పరిమితమైన మంత్రి హామీలు
మెంటాడ: ఇటీవల కురుస్తున్న వర్షాలకు చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జగన్నాథ పురానికి వెళ్లేమార్గంలో ఉన్న తాత్కాలిక పైపు కల్వర్టు పైన ఉన్న మట్టి మొత్తం కోతకు గురైంది. పైపులు మాత్రమే మిగిలాయి. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జనసేన నాయకులు ఎన్నికల ముందు జగన్నాథపురం గ్రామానికి ఆండ్ర ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి తారురోడ్డు, చంపావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని ముమ్మర ప్రచారం చేశారు. గుమ్మడి సంధ్యారాణి అయితే ఒక ఆడుగు ముందుకేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పదవి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జగన్నాథపురం యువత 12 సార్లు ఆమెకు దరఖాస్తులు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా పనులు ముందుకు సాగలేదు. రోడ్డు, బ్రిడ్జి గురించి ప్రశ్నిస్తే గ్రామంలోని కూటమినేతలు ఇదుగో..వస్తుంది అదుగో..వస్తుంది అని చెప్పుకువస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లాగానే ఈ హామీ కూడా గాలిలో కలిసి పోతుందేమోనని ఇక్కడి ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.