
గజపతి జిల్లాలో ప్రైవేటు మెడికల్ కళాశాల నిర్మించాలని వి
పర్లాకిమిడి: ఒడిశాలో వెనుకబడిన ఆదివాసీ బహుళ గజపతి జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మించాలని రాష్ట్ర రవాణా, ఖనిజ శాఖ మంత్రి బిభూతీ జెన్నా ప్రముఖ పారిశ్రామిక వేత్త, హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహినిని బుధవారం భువనేశ్వర్‌లో కోరారు. గజపతి జిల్లాలో అనేక మంది పేదరోగులు పొరుగున ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు సర్జరీలు కోసం వెళ్తు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పర్లాకిమిడి ప్రాంతంలో ప్రైవేటు మెడికల్ కళాశాలను నిర్మించాలని రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా కోరారు. అలాగే పవిత్ర మహేంద్రగిరి పర్యాటక ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేయనున్నట్టు మంత్రి జెన్నా తెలియజేశారు. రాష్ట్ర మంత్రి జెన్నాతో పాటు మహేంద్రగిరి పరిరక్షణ సమితి అధ్యక్షులు భాస్కర తీర్ధ లక్ష్మీబాబా ఉన్నారు. జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో ఒక సంచార మెడికల్, అంబులెన్సు ఏర్పాటు చేయాలని భాస్కర తీర్ధ లక్ష్మీబాబా హైటెక్ మెడికల్ కళాశాల అధిపతి తిరుపతి పాణిగ్రాహిని కోరారు. రాష్ట్ర మంత్రి జెన్నా ప్రతిపాదనకు హైటెక్ మెడికల్ కళాశాల చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి అంగీకరించారు. తప్పకుండా పర్లాకిమిడి లేదా పరిసర ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మించడం జరుగుతోందని ఈ సందర్భంగా తిరుపతి పాణిగ్రాహి అన్నారు.