
సర్వేయర్ ఆత్మహత్య
సీతంపేట: మండలంలోని కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి నాయుడుగూడ గ్రామానికి చెందిన సర్వేయర్ సవర బలరాం (31) ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీడిచెట్టుకు ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. గొయిది గ్రామ సర్వేయర్‌గా పనిచేస్తున్న ఆయనకు జూలైలో భామిని మండలం బత్తిలి వన్ గ్రామ సచివాలయానికి బదిలీ అయ్యింది. ఇటీవల ఆర్థికపరమైన సమస్యలు రావడంతో మనస్తాపానికి గురై ఇంటిపక్కనే ఉన్న జీడితోటలోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు అనీష, చారుమతి ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో గుండెలవిసేలా కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. బలరాం బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వింతవ్యాధితో లక్షకు పైగా కోళ్లు మృతి
● నమూనాలు విజయవాడ ల్యాబ్‌కు తరలింపు
కొత్తవలస: వింత వ్యాధులతో దేశవాళీ, ఫారం కోళ్లు మృత్యవాత పడుతున్నాయని పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు కన్నంనాయుడు మంగళవారం తెలిపారు. కొత్తవలస పశు సంవర్థక శాఖ సబ్‌డివిజన్ పరిధిలోని కొత్తవలస, లక్కవరపుకోట మండలాల పరిధిలో నేటి వరకు లక్ష వరకు కోళ్ల మృతి చెందినట్టు వెల్లడించారు. రెండు మండలాల్లో 80కి పైగా కోళ్ల ఫామ్‌లు ఉన్నాయని, గత నెల రోజుల నుంచి వరుసగా కోళ్లు చనిపోవడం ప్రారంభమైందన్నారు. కోళ్లఫామ్‌ల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని, కోళ్లకు సోకిన వ్యాధి నిర్ధారణకు నమూనాలను విజయవాడ ప్రత్యేక ల్యాబ్‌కు పంపించామన్నారు. చనిపోయిన కోళ్లను ఆరుబయట వేయకుండా గొయ్యితీసి పాతిపెట్టాలని సూచించారు. ల్యాబ్ ఫలితాలు వస్తేగాని వ్యాధి నిర్ధారణ చేయలేమన్నారు.
చంపావతిలో ఇసుక అక్రమ తవ్వకాలు
నెల్లిమర్ల: చంపావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం, మొయిద గ్రామాలకు వెళ్లే రహదారుల్లో చంపావతినదిపై ఉన్న వంతెనలు, తాగునీటి పథకాల సమీపంలో ఇసుక తవ్వకాలు సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఇలాగే కొనసాగితే వంతెనలు, తాగునీటి పథకాలకు ముప్పుతప్పదని ఈ ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమతవ్వకాలను కట్టడి చేయాలని కోరుతున్నారు.

సర్వేయర్ ఆత్మహత్య

సర్వేయర్ ఆత్మహత్య