
సాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం
● తోటపల్లి ఆయకట్టు రైతులు వెల్లడి
వంగర: తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన పాత కాలువ నుంచి వంగర మండలంలోని అన్ని గ్రామాల పంట భూములకు సాగునీటిని సరఫరా చేయకపోతే ఉద్యమిస్తామని రైతులు స్పష్టంచేశారు. మండలంలోని కె.కొత్తవలస, మద్దివలస, ఎం.సీతారాంపురం, కొప్పరవలస, బంగారువలస, రుషింగి, తలగాం గ్రామాలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్దింపేట, పోలినాయుడువలస గ్రామాలకు చెందిన రైతులు మాకుమ్మడిగా ట్రాక్టర్లు, సైకిళ్లు, మోటారు సైకిళ్ల సహాయంతో కాలువ ఎగువ ప్రాంతంలోని కొత్తూరు వద్ద ఆందోళన చేశారు. సాగునీరు విడుదల చేసి 50 రోజులు గడస్తున్నా ఇంత వరకు వంగర మండలంలోని చాలా గ్రామాల భూములకు సరఫరాకాలేదన్నారు. రాజులగుమ్మడ సమీపంలో కాలువకు అడ్డంగా ఉన్న అడ్డుకట్టను రైతులు తొలగించారు. సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డబ్బులు ఎత్తుబడి చేసుకుని కాలువలో జంగిల్, పూడికలు తొలగించినా సాగునీరు అందడంలేదని వాపోయారు. వంగర మండలంలో తోటపల్లి ఆయకట్టు 9వేల ఎకరాలకు సాగునీటి ఎద్దడి ఉందని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.