
100 కిలోల గంజాయి పట్టివేత
ముగ్గురి అరెస్టు
మల్కన్‌గిరి: గంజాయి రవాణా గుట్టురట్టయింది. కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. మల్కన్‌గిరి సమితి చంపాకారి గ్రామ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సబ్‌ఇన్‌సెక్టర్ సర్వేశ్వర్ బోయి మల్కన్‌గిరి నుంచి జయపురం వైపు వేగంగా వస్తున్న కారును ఆపి తనిఖీలు చేశారు. అందులో నాలుగు బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. సోమవారం నిందితులను విచరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన లాలా యాదవ్, గోలాక్ భీశ్వస్, బీహర్‌కు చెందిన లాలాజీ రాజ్భర్ కలిసి గంజాయిని ఛతీస్‌గఢ్ తరలించేందుకు కారులో వచ్చి బలిమెల ప్రాంతంలోని కొనుగోలు చేసి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయిని తూకం వేయగా వంద కిలోలు ఉందని.. దీని విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని ఐఐసీ రీగాన్‌కీండో తెలిపారు. పట్టుబడిన వారి నుంచి ఏడు వేల రూపాయల నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఆధార్‌కార్డులు స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించాలన్నారు.